వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టీమిండియా (Team India) దూసుకు పోతోంది. తాజాగా ఇంగ్లాండ్ (England) పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విఫలం కాగా, బౌలర్లు విజృంభించి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకోవడమే కాకుండా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 229 పరుగులు చేసింది. 230 పరుగుల నిర్దేశిత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్‌పై వంద పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకోగా, ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు చతికిల పడింది. భారత పేస్ ధ్వయం జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీల దాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్లు తక్కువ పరుగులకే పెవీలియన్ బాట పట్టారు. ఓపెనర్ డేవిడ్ మలన్ (16) బూమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బంతికే జో రూట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత
స్టోక్స్ షమీ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్ (27) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు, జస్పిత్ బూమ్రా మూడు వికెట్లు, కులదీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు టీమిండియా జట్టులో రోహిత్ శర్మ చెలరేగి ఆడి 87 పరుగులు చేశాడు.
ఆ తర్వాత వచ్చిన భారత బ్యాటర్లు స్వల్ప పరుగులకే వెను దిరిగారు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్, రాహుల్ తో కలిసి స్కోరును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రాహుల్ 39 పరుగులు చేసి విల్లే బౌలింగ్ లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివరి వరకు సూర్య కుమార్ యాదవ్ ఆచి తూచి ఆడుతూ 49 పరుగులు చేసి విల్లే బౌలింగ్ లో క్రిస్ వోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మరో 21 పరుగుల చేశారు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.