రాజ్‌కోట్ (Rajkot)లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ (Bharath), ఇంగ్లాండ్ (England) జట్టును 434 పరుగుల తేడాతో ఓడించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన ఇండియా జట్టు, టెస్ట్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ ఖాన్ (68) పరుగులతో అదరగొడితే.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలంతో ఆకర్షించాడు.
ఈ దశలో 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అశ్విన్, బుమ్రా చెరొక వికెట్ దక్కించుకొన్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లోయార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా 5వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1తో ముందంజలో ఉంది.
అంతకుముందు భారత రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. జైశ్వాల్ (214) డబుల్ సెంచరీతో చెలరేగడంతో 430 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఓవరాల్గా 556 లీడ్ సాధించింది. 231బంతుల్లోనే జైశ్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. రెండో టెస్టులో ఇంగ్లాడ్పై డబుల్ సెంచరీ చేసిన అతడు.. మూడో టెస్టులోనూ అదే రిపీట్ చేశాడు. దీంతో జైస్వాల్ సొంత గడ్డపై ఒక సిరీస్‌లో 500+ రన్స్ చేసిన రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు.
మరోవైపు మొదటి స్థానంలో గంగూలీ 534 పరుగులతో ఉన్నాడు. ఇక గిల్ 91 రన్స్ వద్ద రనౌట్ అవ్వడంతో సెంచరీ మిస్ అయ్యింది. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 445 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్ 319 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇదిలా ఉండగా టెస్టు చరిత్రలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇంతకు ముందు 2021లో ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ (New Zealand)ను 372 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన భారత్.. ఏడు మ్యాచ్‌ల్లో 50 పాయింట్లు సాధించింది. భారత్ మార్కుల శాతం 59.52కి చేరుకుంది. 55 శాతం మార్కులు సాధించిన ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకొంది.