మణిపూర్ (Manipur) లో ఈ ఏడాది మేలో హింస చెలరేగింది. తాజాగా మణిపూర్ హింసకు సంబంధించిన వీడియో (Video) ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కుకి తెగకు చెందిన ఓ వ్యక్తి సజీవదహనం అవుతూ కనిపించడం కలకలం రేపుతోంది. ఈ వీడియో నేపథ్యంలో కేంద్రంపై విపక్ష ఇండియా కూటమి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.
వీడియోను షేర్ చేస్తూ… ఈ వీడియో మణిపూర్ కు సంబంధించిందని పేర్కొంది. కుకి తెగకు చెందిన వ్యక్తి సజీవ దహనం అయ్యాడని పేర్కొంది. ఈ ఘటన చాలా దురదృష్ట కరమన్నారు. ఇది అమానవీయ ఘటన అని మండిపడింది. మోడీజీ ఇప్పుడు పక్క దేశాల్లో పరిస్థితులపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. మణిపూర్ ను కాపాడటంలో ప్రధాని మోడీ విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది షేర్ చేశారు.
మణిపూర్ నుంచి మరో భయంకరమైన వీడియో వెలుపడుతోందన్నారు. ఒక గిరిజన వ్యక్తిని కందకంలో సజీవ దహనం చేయడం కనిపిస్తోందని పేర్కొన్నారు. అది ఈ ఏడాది మేలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అని పోలీసు అధికారి తెలిపారని చెప్పారు. హింస జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటికి మణిపూర్ అంశంపై ప్రభుత్వం ఇంకా చర్చించలేదన్నారు.
ఇప్పటికీ ఆ అంశానికి కేంద్రం ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. ఏడు సెకన్లు ఉన్న వీడియో ఆదివారం మణిపూర్ వాట్సాప్ గ్రూపుల్లో చెక్కర్లు కొట్టింది. ఇది ఇలా వుంటే మణిపూర్‌లో మరోసారి ఆంక్షలను పొడిగించారు. జిల్లాలో ఎలాంటి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, సమావేశాలకు అనుమతులు లేవని, ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని జిల్లా అధికారులు ప్రకటించారు.