దుబాయ్లో జరుగుతున్న కాప్-28 (COP-28) వాతావరణ సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని ( global renewable energy) మూడు రెట్లు పెంచుతామని ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ మేరకు రూపొందించిన ప్రతిజ్ఞ పై సంతకాలకు భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి. మొత్తం 118 దేశాలు ఈ ప్రతిజ్ఞపై సంతకాలు చేశాయి.
ప్రపంచ దేశాలు శక్తి ఉత్పాదన విషయంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని పెంచాలనేది ఈ తీర్మానం లక్ష్యం. దీంతో పాటు 2030 నాటికి ప్రపంచ సగటు వార్షిక ఇంధన సామర్థ్య మెరుగుదల రేటును 4 శాతానికి రెట్టింపు చేయాలని ఈ సమావేశంలో ప్రపంచ దేశాలు నిర్ణయించాయి.
జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, బ్రెజిల్, నైజీరియాతో పాటు పలు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సంతకానికి దూరంగా ఉన్నప్పటికీ ఒప్పంద లక్ష్యాలను భారత్, చైనాలు సూచన ప్రాయంగా అంగీకారం తెలిపాయి. మొత్తం 198 దేశాలకు సంబంధించిన లక్ష మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అంతకు ముందు ప్రధాని మోడీ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరిగే కాప్-33 సదస్సును భారత్లో నిర్వహించాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను ప్రపంచానికి భారత్ చూపించిందన్నారు. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్ లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువ అని తెలిపారు.