దేశంలో పటిష్టమైన జీడీపీ (GDP) గణాంకాలు “హిందుత్వ వృద్ధి రేటు”ను సూచిస్తున్నాయని బీజేపీ ఎంపీ సుదాన్షు త్రివేది ( Sudhanshu Trivedi) అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దేశంలో కాంగ్రెస్ పాలన నాటి రోజులు తనకు బాగా గుర్తు వస్తున్నాయని తెలిపారు. ఆ రోజుల్లో మన దేశాన్ని అంతా ఎగతాళి చేశారని పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ‘ప్రపంచ సవాళ్ల మధ్య జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థితి’పై చర్చ సందర్భంగా ఎంపీ సుదాన్షు త్రివేది మాట్లాడారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ 2 శాతానికి మించి వృద్ధి చెందలేదని గత యూపీలో పాలనలో అంతా పరిహాసం చేసే వారన్నారు. దాన్ని ‘హిందూ వృద్ధి రేటు’ అని అపహాస్యం చేసేవారని అన్నారు.
కానీ ప్రధాని మోడీ వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. మోడీ పాలనలో దేశం ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎగబాకిందని వెల్లడించారు. ఇప్పుడు మనం 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధి రేటును కలిగిన దేశంగా భారత్ నిలచిందన్నారు.
హిందూత్వంపై ఉంచిన విశ్వాసమే ఈ పరిణామానికి కారణమన్నారు. ఇప్పుడు అతి ‘హిందూ వృద్ధి రేటు’ కాదు ‘హిందుత్వ వృద్ధి రేటు’అని పేర్కొన్నారు. కేవలం రెండు శాతం హిందూ వృద్ధి రేటుతో సంతృప్తి చెందిన వారే ఇప్పుడు హిందుత్వ వృద్ధి రేటుపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డారు.