2047 నాటికి భారత్ (India) అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దేశానికి ఆధునిక పరికరాలతో కూడిన బలమైన సాయుధ బలగాలు అవసరమని రక్షణ శాఖ (Defence Minister) మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. త్రివిధ దళాలకు ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించు కోవాల్సిన అవసరాన్ని ఈ సందర్బంగా ఆయన వివరించారు.
ఢిల్లీ కంటోన్మెంట్ 276 వ వార్షికోత్సవం సందర్బంగా ఢిఫెన్స్ అకౌంట్ డిపార్ట్ మెంట్ (DAD)లో పలు డిజిటల్ కార్యక్రమాలను రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. డిఫెన్స్ అకౌంట్ డిపార్ట్ మెంట్ ను డిఫెన్స్ ఫినాన్స్ కు సంరక్షకునిగా ఆయన అభివర్ణించారు. అంతర్గత విజిలెన్స్ యంత్రాగాన్ని బలపరచాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు.
అంతర్గత విజిలెన్స్ మెకానిజాన్ని బలోపేతం చేస్తే ఎప్పుడైనా సంస్థలో అంతర్గతంగా అనుమానాస్పద కార్యకలాపాల జరిగితే వెంటనే వాటిని గుర్తించి, సరిదిద్దే అవకాశం కనిపిస్తుందన్నారు. దీనివల్ల సమస్యను త్వరగా పరిష్కరించడమే కాకుండా శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని చెప్పారు. సేవల డిమాండ్లు, అందుబాటులో ఉన్న వనరుల కేటాయింపు మధ్య చక్కటి సమతుల్యత ఉండాలన్నారు.
మార్కెట్ శక్తులను పరిశోధించగల, అధ్యయనం చేయగల, ఫీల్డ్ ఆఫీసర్లకు అధిక-నాణ్యత మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించగల అంతర్గత స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని డీఏడీకి ఆయన సూచించారు. పారదర్శకమైన, సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.