రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagawath) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అనేది హిందువుల(Hindu’s) దేశం అని ఆయన స్పష్టం చేశారు. అంటే దాని అర్థం మిగతా మతాలను తిరస్కరించడం కాదని చెప్పారు. ఒక సారి మనం హిందువులు అని చెబితే… ఇక్కడ ముస్లింలకు కూడా రక్షణ కల్పించామని పదే పదే చెప్పాల్సిన పనిలేదు అని ఆయన పేర్కొన్నారు.
కేవలం హిందువులు మాత్రమే ఇలా చేస్తారని అన్నారు. ఇది భారతదేశం మాత్రమే చేస్తుందన్నారు. ఇతరులు దీన్ని చేయలేరన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేకానికి 350 ఏండ్లు పూర్తయిన సందర్బంగా నాగ్ పూర్‌లోని ఓ పాఠశాలలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ….. భారత దేశంలో అన్ని వర్గాలను, విశ్వాసాలను సమానంగా గౌరవించే మతం, సంస్కృతి ఉందని ఆయన వెల్లడించారు.
ప్రపంచంలో చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధం, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం గురించి వింటున్నామని పేర్కొన్నారు. కానీ మన దేశంలో ఇలాంటి సమస్యలపై ఎప్పుడూ యుద్ధాలు జరగలేదన్నారు. శివాజీ మహారాజ్ కాలంలో జరిగిన దండయాత్ర అలాంటిదేనన్నారు. కానీ మనం ఆ సమస్యపై ఎవరితోనూ పోరాడలేదన్నారు. అందుకే మనం హిందువులమన్నారు.
దసరా సందర్భంగా అక్టోబర్ 24న నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ వార్షిక విజయదశమి ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గాయకుడు శంకర్ మహదేవన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగించనున్నారు.