ఖలిస్తాన్ (Kalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) తో పాటు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అణచి వేయాలని నార్త్ అమెరికాలో భారత దౌత్యవేత్తలకు భారత ప్రభుత్వం సీక్రెట్ మెమోను జారీ చేసిందన్న వార్తలపై కేంద్రం స్పందించింది. ఈ వార్తలను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఆ నివేదిక పెద్ద ఫేక్ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. ఇది పూర్తిగా కల్పిత కథనం అన్నారు. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ చెప్పిన బూటకపు కథనాలను మీడియా ప్రచారం చేసిందన్నారు. భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఈ నివేదిక భాగమని ఆయన వెల్లడించారు.
అవన్నీ నకిలీ నివేదికలన్నారు. అలాంటి మెమోను భారత ప్రభుత్వం జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆన్లైన్ మీడియా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ఓ కథనాన్ని ప్రచురించింది.
పశ్చిమ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులను అణచి వేయాలని భారత ప్రభుత్వం ఓ సీక్రెట్ మెమో జారీ చేసిందని కథనాలు రాసింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు రెండు నెలల ముందు ఈ ఏడాది ఏప్రిల్లో ఈ మెమోను జారీ చేసినట్టు మీడియా సంస్థ పేర్కొంది.