రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. జీ-20 లో హిందుత్వ విలువలు (Hindutva values) పాటించడం వల్లే భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అలాంటి గుర్తింపును సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
కోజికోడ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ భూముల గురించి కాకుండా హృదయాలను జయించే విషయంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచ మార్కెట్ గురించి ఈ మొత్తం ప్రపంచానికి సుపరిచతమేనన్నారు. కానీ వారికి వసుధైక కుటుంబం అనే భావన గురించి గతంలో ఎప్పుడూ అవగాహన లేదన్నారు.
వసుధైక కుటుంబం అనే భావనకు జీ- 20 సదస్సులో ఆమోదం లభించిందన్నారు. ఇది ప్రపంచ మార్కెట్ అనే భావనను దాటి ప్రపంచ కుటుంబాన్ని చుట్టు ముట్టే ధృక్పథమన్నారు. వేల ఏండ్లుగా ఈ భావనను భారత్ అవలంభిస్తోందన్నారు. ఈ విశిష్ట జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు మన హిందూ సమాజాన్ని పూర్తిగా వ్యవస్థీకరించ వలసిన అవసరం ఉందన్నారు.
దేశ భక్తి అనేది భారత్‌లో అన్ని మతాలు, కులాలు, భాషల మధ్య నడిచే ఉమ్మడి బాంధవ్యమన్నారు. మూడు వేల ఏండ్లకు పైగా భారత్ అలాంటి వాస్తవంలో జీవినం సాగిస్తోందని పేర్కొన్నారు. పలు భాషలు, భిన్న సంస్కృతులు, ఆహార అలవాట్లు, మతాలు, కులాలు, జీవనశైలి ఇలా దేశంలో వున్న వైవిధ్యం గురించి ఆయన వివరించారు. దేశంలో పలు విషయాల్లో వ్యత్యాసాలు వున్నప్పటికీ వైవిధ్యాన్ని భారత్ ఒక జీవన విధానంగా స్వీకరించిందని చెప్పారు.
వేల ఏండ్ల నాటి ఉమ్మడి పూర్వీకుల డీఎన్ఏతో పాటు భాగస్వామ్య సంస్కారాలను కూడా భారతీయులు పంచుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పలు శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. హిందూ సమాజంలో ఐక్యతకు ఉన్న ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. దేశంలో వ్యవస్థీకృత సమాజాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అవి సంపన్న దేశానికి దోహదం చేస్తాయన్నారు.