అమెరికాలో ఏపీ విద్యార్థిని కందుల జాహ్నవి మృతిపై అక్కడి పోలీసులు జోక్ లు వేస్తూ హేళన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయింది. ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కో లోని ‘కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా’తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కాన్సులేట్ డిమాండ్ చేసింది.
ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై సియాటెల్ స్థానిక అధికారులతో పాటు వాషింగ్టన్ డీసీలోని అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించింది. నిందితులను కఠినంగా శిక్షించేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొంది.
మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని ట్వీట్ చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని యూఎస్ లోని భారత దౌత్య వేత్తలను ఆయన కోరారు. విద్యార్థిని జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలని కేటీఆర్ కోరారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ను కూడా ఆయన తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి ఈ ఘటను తీసుకు వెళ్లాలని జై శంకర్ కు ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో స్వతంత్ర దర్యాప్తు జరిపేలా డిమాండ్ చేయాలని జై శంకర్ ను ఆయన కోరారు. అమెరికాలోని సౌత్ లేక్ యూనియన్ లోని ఈస్టర్న్ వర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న ఏపీ విద్యార్థిని కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో మరణించారు.
సియాటెల్ లో రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆమె మరణించారు. తాజాగా యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు. యాక్సిడెంట్ తర్వాత విచారణ అధికారి డేనియల్ ఆడెరర్ తన సహోద్యోగికి ఫోన్ చేశారు. ఆ సమయంలో జాహ్నవిని హేళన చేస్తూ మాట్లాడారు. ఆమె ఓ సాధారణ వ్యక్తి అని, మరణించిందంటూ నవ్వుతూ చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోనున్నట్టు పోలీసు శాఖ వెల్లడించింది.