ఇజ్రాయెల్ (Israel) దాడులతో అతలాకుతలమైన గాజా (Gaza)కు భారత్ మానవతా సహాయాన్ని అందించింది. గాజాలోని పాలస్తీనీయులకు వైద్య సహాయం (Medical Aid) (పరికరాలు), విపత్తు సహాయ సామాగ్రిని భారత్ పంపించింది. ఈ మేరకు విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు.
అత్యావసర సమయంలో ప్రాణాలను రక్షించే మందులు, సర్జికల్ పరికరాలు, టెంట్లు, నిద్రపోయేందుకు సంచులు (Sleeping Bags),టార్పాలిన్లు, నీటిని శుభ్రపరించే ట్యాబె లెట్లతో పాటు ఇతర ఔషధాలను పంపినట్టు ఆయన పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల కోసం 6.5 టన్నుల వైద్య సహాయం, 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని తీసుకుని భారతీయ వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరిస్ విమానాశ్రయానికి బయలుదేరిందని చెప్పారు.
హమాస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో అక్టోబర్ 7 నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్‌తో 4,300 మంది పాలస్తీనీయన్లు మరణించినట్టు హమాస్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నిన్న రాత్రి ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో 50 మంది పాలస్తీనా పౌరులు మరణించినట్టు హమాస్ వైద్య శాఖ పేర్కొంది.
ఇది ఇలా వుంటే ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపు నిచ్చారు. ఇజ్రాయెల్ తోపాటు పాలస్తీనా పౌరులకు భద్రత, గౌరవం శాంతి అవసరమని పేర్కొన్నారు. అది రెండు దేశాల సహకారంతోనే సాధ్యమని ఆయన తెలిపారు.