తక్షణ మానవత సాయం కోసం గాజా (Gaza)లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ (Cease Fire) పాటించాలని, ఇరు పక్షాల చేతుల్లో బందీలు(Hostages)గా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. ఐరాస తీర్మానంపై బహ్రెయిన్, అల్జీరియా, కువైట్, ఒమన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, పాలస్తీనాతోపాటు పలు దేశాలు సంతకాలు చేశాయి. అగ్రదేశం అమెరికాతో పాటు ఇజ్రాయెల్ సహా మొత్తం పది దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.
మరోవైపు 23 దేశాలు ఈ తీర్మానంపై ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ నుంచి పంపిన శక్తివంతమైన సందేశం పరంగా ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. ముసాయిదా తీర్మానంలో హమాస్ పేరు ప్రస్తావించకపోవడంపై అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు పలు దేశాలు తప్పుపట్టాయి.
ముసాయిదా తీర్మానంలో సవరణ చేపట్టాలని ఆయా దేశాలు డిమాండ్ చేశాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసిందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యకు శాంతియుతమైన, ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నాలు చేయాలన్నారు.