రాబిన్ హుడ్ (Robin Hood)…. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనవంతులను దోచుకుని పేదలకు పంచిన గొప్ప వ్యక్తి. అందుకే ఆయన అంత ఫేమస్ అయ్యారు. కానీ మన దేశంలో కూడా ఓ రాబిన్ హుడ్ ఉన్నారని చాలా మందికి తెలియదు. 1889లో ఆయన అరెస్టు వార్తను ప్రస్తావిస్తూ ‘ఇండియన్ రాబిన్ హుడ్ అరెస్టు’అంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ (Newyork Times) వార్తను ప్రచురించిందంటేనే ఆయన గురించి మనకు అర్థం అవుతుంది.
షాహిద్ తాంతియా బిల్.. ఆయన్ని అంతా ఇండియన్ రాబిన్ హుడ్ అని పిలిచేవారు. తాంతియా బిల్ 1842లో మరాఠా రాజ్యంలో జన్మించారు. బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టాలని చిన్నతనంలోనే ఆయన నిశ్చయించుకున్నాడు. చిన్నతనం నుంచే గెరిల్లా యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అతి తక్కువ కాలంలోనే సాంప్రదాయ విలు విద్యలో నిష్ణాతుడిగా మారాడు.
తన జీవిత మంతా అడవులు కొండలు, గుట్టలపై గడిపాడు. బ్రిటీష్ ఖజానాను కొల్లగొట్టి పేదలకు పంచి పెట్టాడు. అందుకే పేదలు ఓ దేవుని లాగా భావించే వారు. ఎన్నో సార్లు బ్రిటీష్ వారి చేతికి చిక్కి వాళ్ల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. బ్రిటీష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చివరికి ఓ దగ్గరి బంధువు వెన్ను పోటు పొడిచి పోలీసులకు పట్టించాడు.
అనంతరం జబల్ పూర్ సెషన్స్ కోర్టు 1889 అక్టోబర్ 19న ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఇండోర్ లోని ఓ రహస్య ప్రదేశంలో తాంతియా బిల్ ను బ్రిటీష్ అధికారులు ఉరి తీశారు. ఆ తర్వాత ఆయన మృత దేహాన్ని ఇండోర్ సమీపంలోని ఖాండ్వా రైల్వే మార్గంలో విసిరి వేశారు. అక్కడే ఆయన సమాధిని నిర్మించారు. ఇప్పటికి కూడా తాంతియాకు గౌరవ సూచకంగా ఆ ప్రాంతంలో లోక్ పైలెట్లు రైలును ఒక్క క్షణం పాటు ఆపుతారు.