గత 30 రోజుల్లో భారత దౌత్యం అత్యున్నత స్థాయికి చేరుకుందని ప్రధాని మోడీ (PM MOdi) అన్నారు. జీ 20 సదస్సులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు (Decisions) 21వ శతాబ్దంలో ప్రపంచ (World) దిశను మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. గడిచిన 30 రోజుల్లో తాను 80 మంది అంతర్జాతీయ నేతలను కలిసినట్టు ప్రధాని వెల్లడించారు.
ఢిల్లీలో నిర్వహించిన జీ-20 యూనివర్శిటీ కనెక్ట్ ఫినాలేలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భిన్న దృక్పథాలు కల ప్రస్తుత వాతావరణంలో అనేక దేశాలను ఒకే వేదికపైకి తీసుకు రావడం అంత తేలికైన పని కాదని తెలిపారు. దేశ అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు స్పష్టమైన, పారదర్శకమైన, స్థిరమైన ప్రభుత్వం అవసరమని అన్నారు.
గడిచిన 30 రోజుల గురించి తాను రిపోర్డు కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ రిపోర్టు కార్డు నూతన భారత దేశ వేగం, స్థాయి గురించి ఒక ఆలోచన ఇస్తుందని పేర్కొన్నారు. అగస్టు 31ను మీరంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఆ రోజు అందరూ భారత్ కోసం ప్రార్థించారని చెప్పారు.
అకస్మాత్తుగా అప్పుడే అందరి ముఖాల్లో చిరునవ్వు వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తం అప్పుడు భారత వాణిని విన్నదన్నారు. చంద్రునిపైకి భారత్ చేరుకుందన్నారు. చంద్రుని మిషన్ విజయవంతం అయిన వెంటనే భారత్ తన సౌర మిషన్‌ను ప్రారంభించిందన్నారు. గడచిన 30 రోజుల్లో భారతదేశ దౌత్యం ఉన్నత శిఖరాలకు చేరిందన్నారు.
జీ-20 సమ్మిట్ దౌత్య, ఢిల్లీ కేంద్రీకృత కార్యక్రమానికే పరిమితం అయివుండేదన్నారు. కానీ భారత్ దీన్ని ప్రజల ఆధారిత జాతీయ ఉద్యమంగా మార్చిందన్నారు. భారత ప్రయత్నాల వల్ల మరో ఆరు దేశాలు బ్రిక్స్ కమ్యూనిటీలో చోటు దక్కించుకున్నాయన్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై 100 శాతం ఏకాభిప్రాయం అనేది ప్రపంచంలో ముఖ్యాంశంగా మారిందన్నారు.