రన్ మిషన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో రికార్డు సాధించాడు. ప్రపంచ కప్ వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. వన్డేల్లో కొహ్లీ సెంచరీల సంఖ్య 49కు చేరుకుది. దీంతో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును కోహ్లీ సమం చేశాడు. 289 వన్డేల్లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును అందుకున్నారు.
అంతకు ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ మార్క్ ను 463 మ్యాచ్ ల్లో చేరుకున్నారు. ఈ జాబితాలో మూడవ స్థానంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 259 మ్యాచ్ ల్లో హిట్ మ్యాన్ 31 సెంచరీలు చేశాడు. మరోవైపు వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడవ స్థానంలో నిలిచారు.
శ్రీలంక స్టార్ బ్యాటర్ కుమార సంగక్కరను వెనక్కి నెట్టి కోహ్లీ ఈ ఘనతను సాధించారు. ఇక వన్డే ప్రపంచ కప్ ఒక ఎడిషన్‌లో కోహ్లీ తొలిసారి 500 పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించారు.
భారత్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో 6000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించారు. అంతకు ముందు భారత్ నుంచి కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. ఇది ఇలా వుంటే కోహ్లీ తన 35వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. బర్త్ డే రోజు కోహ్లీ సెంచరీ బాదడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.