ఇండోనేషియా (Indonasia)లో అగ్ని పర్వతం బద్దలైంది. సుమత్రా (Sumatra)లోని మౌంట్ మరపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మరణించారు. మరో 12 మంది వరకు గల్లంతు అయ్యారు. వారిలో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది కాపాడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు.
విస్పోటన సమయంలో 75 మంది ట్రెక్కింగ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. విస్పోటన సమయానికి 49 మంది పర్వతం నుంచి కిందుకు దిగి వచ్చారని తెలిపారు. విస్పోటనం వల్ల వారికి గాయాలైనట్టు చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించామన్నారు. మిగతా 26 మందిలో 11 మంది మరణించినట్టు గుర్తించామన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు వెల్లడించారు.
వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో 12మంది ఆచూకీ ఇంకా తెలియలేదన్నారు. అగ్నిపర్వతంలో విస్పోటనం కొనసాగుతోందన్నారు. అందువల్ల హెలికాప్టర్ ద్వారా వారిని ఎయిర్ లిఫ్ట్ చేయడం సాధ్యం కాలేదన్నారు. మౌంట్ మరాపి సమీపంలో నిషేధాజ్ఞలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు.
అగ్నిపర్వతం విస్ఫోటనం నేపథ్యంలో ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు బూడిద వ్యాపించింది. సుమత్రాలో మూడవ అతి పెద్ద నగరమైన బుక్కిటింగి ప్రాంతం వరకు బూడిద వ్యాపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మాస్కులు ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.