నాలుగు నెలల పాటు అల్లర్లతో అట్టుడికి పోయిన మణిపూర్ (Manipur) లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజాగా ఇంటర్నెట్ సేవల (Internet Services) ను పునరుద్దరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ సర్వీసులను నేటి నుంచే పునరుద్ధరిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఏడాది మే3న కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో ఆందోళనకారులు చాలా చోట్ల విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను తగుల బెట్టారు. సుమారు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతోంది. అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడటంతో అక్కడక్కడా పాక్షికంగా నిషేధం ఎత్తి వేశారు.
తాజాగా ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బది పడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సదుపాయాలు సహా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం తాజాగా నిషేధాన్ని ఎత్తి వేసింది.
మణిపూర్ లో ఘర్షణలు చెలరేగిన రోజు నుంచి ఇప్పటి వరకు 175 మంది చని పోయినట్టు ఇటీవల అధికారులు వెల్లడించారు సుమారు 1100 మంది గాయపడినట్టు పేర్కొన్నారు. వేలాది మంది నిరాశ్రయులైనట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆస్తులకు నిప్పంటించిన కేసులు 5,172 నమోదయ్యాయన్నారు. 4786 ఇండ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారన్నారు.