కాంగ్రెస్ సర్కారు చేస్తున్న రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మేడిగడ్డ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపర్ డ్యామ్(Copper dam) కడతామని ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చినట్లు కథనాలు వచ్చాయి.
అయితే, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam kumar reddy) బ్యారేజీకి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం లేదని ఆదేశించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఫైర్ అయ్యారు.
‘కాంగ్రెస్ (Congress) పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి రుజువు చేసింది. మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి మరమ్మతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.డిపార్ట్‌మెంట్ ఇంజినీర్లు బ్యారేజీకి మరమ్మతులు చేయాలని రిపోర్టు ఇచ్చాక ఎల్‌అండ్‌టీ కంపెనీ అందుకోసం ముందుకు వచ్చింది
కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి ఒకే అజెండాతో కాపర్ డ్యాం కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తుంది.
ఇంత నికృష్టమైన రాజకీయాలు కేవలం ఎన్నికల్లో లాభం కోసమే చేస్తున్నారా?’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అయ్యర్ కమిటీ సిఫారసులు వచ్చాకే రిపేర్లు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.