భారతీయులు బంగారం ప్రియులు.మనవాళ్లు ఇష్టపడినంతగా బంగారాన్ని బహుశా ఎవరూ ఇష్టపడకపోవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం (GOLD) లేకుండా భారతీయ మహిళలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు.ఎంత బంగారం ఉన్నా ఏదో సందర్భంలో కొనుగోలు చేస్తుంటారు.అయితే, రానున్న రోజుల్లో బంగారం సామాన్యుడికి అందనంత భారంగా మారనుంది.
ఉన్నట్టుండి గత నెలరోజుల వ్యవధిలోనే బంగారం ధర భారీగా పెరుగుతూ (HIKE) వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,300కు చేరుకున్నది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.64వేలకు పైగా పలుకుతోంది.
మరోవైపు వెండి(SILVER) ధర కూడా చుక్కలను తాకుతోంది. అసలే పెళ్లిళ్ల మాసం కావడంతో బంగారం ధరలు మరింత ప్రియం కానున్నట్లు సమాచారం. శుభకార్యాల సమయంలో సామాన్యుడికి బంగారం ధరలు నిజంగానే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో బంగారం మీద పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరగడం, అంతర్జాతీయంగా ఏర్పడిన డిమాండ్, మరికొందరు బడా వ్యాపారవేత్తలు బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో బ్లాక్ చేయడం వలన కూడా బంగారం ధరలు పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు.ఇదిలాఉండగా, బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని తెలుస్తోంది.