ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్ (Iskcon)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ (Menaka Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఇప్పుడు అతి పెద్ద మోసమంటే ఇస్కాన్ అంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇస్కాన్ తన గోశాల్లోని పశువులను కసాయి వాళ్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఇస్కాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
ఇస్కాన్ వాళ్లు గోశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. వాటిని నడిపేందుకు ప్రభుత్వం నుంచి అపరిమితమైన ప్రయోజనాలను ఇస్కాన్ పొందుతోందన్నారు. ఈ గోశాల కోసం అపారమైన భూములను ప్రభుత్వం ఇస్తోందన్నారు. తాను ఇటీవల అనంతపుట్ గోశాలను సందర్శించానన్నారు. కానీ అక్కడ పాలు ఇచ్చే ఆవు ఒకటి కూడా లేదని ఆమె వెల్లడించారు.
అక్కడ దూడలు కూడా లేవన్నారు. అన్ని ఆవులను కసాయిలకు అమ్మి వేస్తున్నట్టు తెలిసిందన్నారు. తమ జీవితమంతా పాల పైనే ఆధారపడి ఉందని వారు చెబుతారు… బహుశా వారు కసాయిలకు విక్రయించినంతగా పశువులను మరొకరు విక్రయించి వుండరని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇస్కాన్ స్పందించింది. మేనకా గాంధీ వ్యాఖ్యలు నిరాధారమైనవని అని పేర్కొంది. తాము గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ యుదిష్టర్ గోవింద్ దాస్ తెలిపారు. తాము కేవలం భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో గోవులను, పశువులను ఆదరిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.