ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) మధ్య ఒప్పందాన్ని (Truce) మరో రోజు పొడిగించారు. ఇరు దేశాల మధ్య బందీల అప్పగింత, కాల్పుల విరమణ ఒప్పందం ఈ రోజు ఉదయంతో ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయ ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
బందీలను విడుదల చేసే ప్రక్రియను కొనసాగించాలని మధ్యవర్తులు ప్రయత్నాలు చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు లోబడి గాజా స్ట్రిప్‌లో యుద్ద విరామం కొనసాగుతుందని తెలిపింది. మరోవైపు ఈ పొడగింపు విషయాన్ని హమాస్ సంస్థ కూడా వెల్లడించింది. మరో 24 గంటల పాటు యుద్ద విరామం కొనసాగుతుందని తెలిపింది.
మరోవైపు 30 మంది పాలస్తీనా ఖైదీలను నిన్న రాత్రి విడుదల చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 210 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్ కు చెందిన 70 మందిని విడుదల చేసింది. వారితో పాటు మరో 30 మంది ఇతర దేశాల పౌరులను విడిచిపెట్టింది.
అంతకు ముందు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తాత్కాలిక సంధిని పొడిగించడం, మానవత సహాయాన్ని అందించే విషయంపై ఇజ్రాయెల్ అధికారులతో ఆయన చర్చించారు. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ లో బ్లింకన్ మూడవ సారి పర్యటిస్తున్నారు.