ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas) మిలిటెంట్ల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకుంది. ఓ వైపు వైమానిక దాడులు (Air Strikes) కొనసాగిస్తూనే మరో వైపు గాజాలో భూ మార్గంలో దాడులు జరిపేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు దక్షిణ ఇజ్రాయెల్‌లో సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. ఈ క్రమంలో రిజర్వ్ బలగాలు ఇప్పటికే గాజాకు చేరుకుంటున్నాయి.
ఇక ఇరు వర్గాల దాడుల్లో మరణించిన వారి సంఖ్య 3000 దాటింది. గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి వైమానిక దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది.
అమెరికా నుంచి అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రితో బయలు దేరిన విమానం ఇజ్రాయెల్ లోని నెవాటిమ్ వైమానిక స్థావరంలో దిగినట్టు ఢిపెన్స్ వర్గాలు వెల్లడించాయి. హమాస్ మిలిటెంట్లపై దాడులకు ఈ ఆయుధాలను ఉపయోగిస్తామని చెప్పింది. మరోవైపు సిరియాపై వైమానిక దాడులు చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇది ఇలా వుంటే హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో మొత్తం 40 మంది పసిబిడ్డలను హమాస్ ఉగ్రవాదులు హతమార్చారని ఆ దేశ మీడియా వెల్లడించింది. హమాస్ మిలిటెంట్లు దాడులు జరిపిన ప్రాంతాల్లో 40 మంది పిల్లల మృత దేహాలు లభించినట్టు ఇజ్రాయెల్ సైనికులు వెల్లడించారని మీడియా పేర్కొంది.