గాజా(Gaza)లో విధ్వంసం కొనసాగుతోంది. హమాస్ (Hamas) మిలిటెంట్లే టార్గెట్ గా ఇజ్రాయెల్ (Israel)ఎయిర్ స్ట్రైక్స్, భూతల దాడులు కొనసాగిస్తోంది. గాజాలో మృతుల సంఖ్య 7650కి చేరింది. ఇప్పటి వరకు 19450 మంది గాయపడినట్టు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
యుద్ధం నేపథ్యంలో తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక శిథిలాల మధ్య పాలస్తీనా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో మొబైల్స్ పని చేయకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అంతర్జాతీయ సహాయక బృందాలు చెబుతున్నాయి.
గాజాలో మొబైల్ నెట్ వర్క్‌లు స్తంభించడంతో ప్రజలు దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గాజాలోని 23 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బాంబు దాడుల నేపథ్యంలో గాజాలో ఇంటర్నెట్, సెల్యూలార్, ల్యాండ్‌లైన్ సేవలకు పూర్తిగా ఆటంకం ఏర్పడిందని పాలస్తీనా టెలికాం ఆపరేటర్ పాల్ టెల్ వెల్లడించింది.
ఇది ఇలా వుంటే ఇజ్రాయెల్ పై రష్యా తీవ్ర స్థాయిలో మండి పడింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్దమని రష్యా తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ భూతల దాడులు కొనసాగిస్తున్నందున వేలాది మంది పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.