ఇజ్రాయెల్- హమాస్ మిలిటెంట్ల మధ్య వార్ కొనసాగుతోంది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్దంలో ఇప్పటి వరకు ఇరువైపులా సుమారు 4 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేల మందికి పైగా గాయపడ్డారు. హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ల చేతిలో మొత్తం 199 మంది వరకు బందీలుగా వున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అందులో విదేశీయులు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియ రాలేదని తెలిపింది.
ఓ వైపు గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంటే మరోవైపు గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్ దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి చెక్ పెట్టాలంటే గ్రౌండ్ ఆపరేషన్ సరైన మార్గం అని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. అందుకే భూతల దాడికి ఇజ్రాయెల్ సైన్యం రెడీ అయింది. ఈ మేరకు గాజా స్ట్రిప్ సరిహద్దుల వద్దకు వేలాది మంది సైనికులను ఇజ్రాయెల్ మోహరించింది. భూతల దాడులకు రాజకీయ ఆమోదం కోసం ఇజ్రాయెల్ ఎదురు చూస్తోంది.
రాజకీయ ఆమోదం రాగానే గ్రౌండ్ ఆపరేషన్ తో విరుచుకు పడేందుకు ఇజ్రాయెల్ సైన్యం రెడీగా ఉంది. ఇక ప్రజలు గాజా విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు చేసింది. గాజా స్ట్రిప్ లో మొత్తం జనాభా 23 లక్షలుగా ఉంది. అందులో ఉత్తర గాజాలో 11 లక్షల మంది ఉండగా…. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజాలో 10 లక్షల మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి దక్షిణ గాజాకు తరలిపోయారు.
ఇది ఇలా వుంటే గాజాపై ఒక వేళ ఇజ్రాయెల్ భూతల దాడికి దిగితే అది ప్రపంచంలో అతి పెద్ద మానవతా సంక్షోభానికి దారి తీస్తుందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక గాజా సరిహద్దుల్లో వున్న ఇజ్రాయెల్ సైనికులకు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు కూడా వచ్చి చేరాయి. హమాస్ మిలిటెంట్ల ఏరివేత విషయంలో వెనక్కి తగ్గేదేలే అని ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు.
గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ ఇప్పటికే ఇజ్రాయెల్ అష్ట దిగ్బంధం చేసంది. దీంతో గాజాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గాజాలో ఆహారం, నీటి కొరత నెలకొంది. గత కొన్ని రోజులుగా గాజాలో విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో గాజా ప్రజలు చిమ్మ చీకట్లలో ఉంటున్నారు. ఐరాస ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో సుమారు 4 లక్షల మందికి పైగా తలదాచుకుంటున్నట్టు ఐరాస వర్గాలు వెల్లడించాయి.