ఇజ్రాయెల్ (Israel) లో పౌరులను హమాస్ (Hamas) మిలిటెంట్లు ఊచకోత కోస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని నగరాల్లో ఇంటింటికి తిరుగుతూ పిల్లలు, పెద్దలు, మహిళలు ఇలా కనిపించిన వాళ్లపై కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ యుద్దంలో ఇరు వైపులా 1100 మందికి పైగా మరణించాని తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో సుమారు 600 మందికి పైగా మరణిచారని అధికారులు చెబుుతున్నారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో పాలస్తీనియన్లు సుమారు 400 మంది మరణించినట్టు గాజా స్ట్రిప్ అధికారులు వెల్లడించారు. ఓ వైపు ఇజ్రాయెల్ పై దక్షిణం నుంచి హమాస్ దాడులు చేస్తుంటే మరో ఉత్తరాన లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఉగ్ర సంస్థ దాడులు చేస్తోంది.
పాలస్తీనా పోరాటానికి తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్టు హిజ్బుల్లా సంస్థ తెలిపింది. ఆ మేరకు ఇజ్రాయెల్ పై రాకెట్లు, షెల్స్‌ను ప్రయోగించినట్లు ఉగ్రసంస్థ పేర్కొంది. ఈ దాడులను ఇజ్రాయెల్ దళాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. మరోవైపు హమాస్ చేతిలో బంధీలుగా వున్న వారిని విడిపించాలని ఈజిఫ్టు సహాయాన్ని ఇజ్రాయెల్ కోరింది. దీంతో ఇజ్రాయెల్, హమాస్ లతో ఈజిఫ్టు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఇక గాజా సరిహద్దుల్లోని కిబట్జ్ రీయిమ్ లోని ఓ హోటల్‌లో నిర్వహిస్తున్న మ్యూజిక్ ఈవెంట్ పై హమాస్ మిలిటెంట్లు దాడులకు దిగారు. ఈ కాల్పుల్లో సుమారు 260 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల్లో నలుగురు అమెరికన్ పౌరులు మరణించినట్టు తెలుస్తోంది. హమాస్ ను ఎదుర్కొనే విషయంలో ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు పలికింది.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నౌకలను, యుద్ద విమానాలను ఆ దేశ సరిహద్దుల్లోకి మోహరించాలని అధికారులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. యూఎఫ్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ కు చెందిన 5వేల మంది నావికులను పంపిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. హమాస్‌కు ఆయుధాలు అందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
ఇది ఇలా వుంటే సుమారు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకు పోయినట్టు తెలుస్తోంది. శనివారంతో ఆదివారం వరకు పరిస్థితులు కాస్త మెరుగు పడ్డట్టు భారతీయ విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మీనాక్షి లేఖ్ రాజ్ తెలిపారు.