ఇజ్రాయెల్ (Israel)-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం ఆరవ రోజుకు చేరుకుంది. గాజా (Gaza) స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎయిర్ స్ట్రైక్స్ కు పరిమితమైన ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టే యోచనలో ఉంది. ఈ యుద్ధంలో 1500 మంది పాలస్తీనీయన్లు మరణించగా, ఇజ్రాయెల్ కు చెందిన 1300 మంది మరణించినట్టు అధికారులు వివరించారు.
గ్రౌండ్ ఆపరేషన్ నేపథ్యంలో ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ దళాలు ఆదేశించాయి. 24 గంటల్లోగా ఉత్తర గాజాను ఖాళీ చేసి వెళ్లాలని అల్టిమేటం జారీ చేశాయి. ఉత్తర గాజాలో సుమారు 11 లక్షల మంది జనాభా వున్నారు. ఇది ఇలా వుంటే ఇజ్రాయెల్ ఆదేశాల అమలు సాధ్యం కాదని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధం నేపథ్యంలో 3,38,000 మంది పాలస్తీనీయులు నిరాశ్రయులు అయినట్టు ఐరాస వెల్లడించింది. 2,18,000 మంది పాలస్తీనీయులు ఐరాస ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తల దాచుకుంటున్నారని చెప్పింది. ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో చర్చించనున్నారు. హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పూర్తిగా అణచి వేస్తుందని, మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించే వరకు తాము నిద్రపోబోమని ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెత న్యాహూ వెల్లడించారు.
మరోవైపు లెబనన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. మొత్తం నాలుగు మిస్సైల్స్ ను ఇజ్రాయెల్ తెలిపింది. మార్జియాన్, కియామ్ లల్లో మూడు క్షిపణులను ప్రయోగించారని, మరో క్షిపణిని అల్ మారీ ప్రాంతంలో పడినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లెబనాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా వుంటే గాజాకు అత్యవసరమైన ఔషదాలు, ఆహారం, మానవతా సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని హమాస్ కోరింది.
గాజాలోని జబాలియా క్యాంపుపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది . ఈ దాడుల్లో ఐదుగురు పాలస్తీనియన్లు మరణించినట్టు హమాస్ మీడియా చెప్పింది. ఇక యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోని బ్లింకన్ ఇజ్రాయెల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి బ్లింకన్ కు నెతన్యాహూ వివరించారు. యుద్దం నేపథ్యంలో నెలకొన్న హృదయ విదారక దృశ్యాలను ఆయనకు చూపించారు.
మరోవైపు యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ అస్టిన్ ఈ రోజు ఇజ్రాయెల్ చేరుకున్నారు. రాజధాని టెల్ అవీవ్ కు కొంత సేపటి క్రితం చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూతో పాటు రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తో లాయిడ్ అస్టిన్ సమావేశం కానున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కు బ్రిటన్ మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా రెండు రాయల్ నేవీ నౌకలను పంపించనున్నట్టు తెలిపింది..