ఇజ్రాయెల్ (Israel) ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పుల విరమణ (Ceasefire) చేపట్టే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించారు. కాల్పుల విరమణ చేపడితే తాము హమాస్ కు లొంగి పోయినట్టే అవుతుందని ప్రధాని స్పష్టం చేశారు.
కాల్పుల విరమణకు పిలుపు నివ్వడమంటే హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ను సరెండర్ కావాలని చెప్పడమేనని తెలిపారు. టెర్రరిజం ముందు లొంగిపోవడమనేది తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఈ యుద్ధంలో తాము విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.
అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అష్డోద్లోని దక్షిణ సెక్టార్ నేవీ బేస్‌ను సందర్శించారు. మీరు యోధులు, సముద్ర సింహాలు అంటూ నేవీ దళాలను ఆయన ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా కూడా కాల్పుల విరమణకు అభ్యంతరం వ్యక్తం చేసింది.
కానీ ఈ యుద్దంలో గాజాలోని సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించింది. ఇది ఇలా వుంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 25 వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 8,300 మంది మరణించారని, వారిలో 66 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. సుమారు పదివేల మంది వరకు గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.