ఇజ్రాయెల్ (Israel)- పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూపునకు మధ్య హోరా హోరి పోరు కొనసాగుతోంది. గత రెండు రోజులుగా హమస్ (Hamas) ఉగ్ర సంస్థ సభ్యులతో ఇజ్రాయెల్ సైన్యం పోరాటం చేస్తోంది. గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. ఈ దాడిలో పలు భవనాలు నేల మట్టం అయ్యాయి.
మరో వైపు ఉత్తర భాగంలో సిరియా సరిహద్దుల వద్ద ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా హెజ్బొల్లా సంస్థ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై శనివారం హమాస్ సభ్యులు 2 వేల రాకెట్లతో దాడులు జరిపారు. సైనిక రక్షణలను చేధించి అనేక మందిని హమాస్ తీవ్ర వాదులు బందీలుగా తీసుకు వెళ్లారు. వారిలో ఇజ్రాయెల్ కు చెందిన సామాన్య ప్రజలతో పాటు ఇతర దేశాల పౌరులు, సైనికులు వున్నారు.
వాళ్లను అడ్డు పెట్టుకుని ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న తమ వారిని విడిపించుకోవాలని హమాస్ చూస్తున్నట్టు సమాచారం. మరోవైపు బందీలను విడిపించే విషయంలో ఈజిప్టు సాయాన్ని ఇజ్రాయెల్ కోరింది. ఈ క్రమంలో ఈజిఫ్టు నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి. హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధులతో ఈజిఫ్టు చర్చలు జరుపుతోంది.
ఇక హమాస్ దాడుల తర్వాత మరణించిన వారి సంఖ్య 600 దాటినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో 44 మంది సైనికులు ఉన్నట్లు పేర్కొంది. గాజా పరిధిలో మొత్తం 313 మంది మరణించినట్టు వెల్లడించింది. ఇక తాము 400 మంది తీవ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైనికాధికారి చెప్పారు.
హమాస్ మిలిటెంట్ల దాడికి ఇజ్రాయెల్ బలగాలు ప్రతీకారం తీర్చుకుంటాయని ఆయన అన్నారు. తమ శత్రువులు దీనికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. గాజాలో దాక్కున్న కమాండర్లను బయటికి రప్పించి మరి హతమారుస్తామని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
మరో వైపు ఇజ్రాయెల్‌కు వెళ్లే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టెల్ అవీవ్ నుంచి విమాన రాక పోకలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 14 వరకు ఈ నిర్ణయం అమలులో వుంటుందని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.