భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ (Somnath) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజూ ఇస్రో వందకు మించి సైబర్ దాడులు (Cyber Attacks) ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అత్యాధునిక సాఫ్ట్ వేర్ (SoftWare) , చిప్ ఆధారిత హార్డ్ వేర్ (Hardware) ను ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడుల జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
కేరళలోని కొచ్చిలో నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి రోజూ ఇస్రో వందల కొద్ది సైబర్ దాడులను ఎదుర్కొంటోందన్నారు. అలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇస్రో పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ నెట్ వర్క్ ను సమకూర్చుకుందన్నారు.
సాఫ్ట్‌వేర్‌తో పాటు, రాకెట్లలోని హార్డ్‌వేర్ చిప్‌ల భద్రతపై దృష్టి సారించి వివిధ పరీక్షలతో ఇస్రో ముందుకు వెళుతోందని ఇస్రో చీఫ్ వివరించారు. గతంలో కేవలం ఒక శాటిలైట్‌ను పర్యవేక్షించే విధానం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఏక కాలంలో చాలా శాటిలైట్లను సాఫ్ట్ వేర్ ద్వారా పర్యవేక్షించే విధానం వచ్చిందన్నారు. ఇది ఈ రంగంలోని అభివృద్ధిని తెలియజేస్తోందన్నారు.
కొవిడ్ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి రాకెట్ లాంఛింగ్ చేయడం సాధ్యమైందన్నారు. అది టెక్నాలజీ సాధించిన విజయాలను సూచిస్తుందన్నారు. నావిగేషన్, మెయింటెనెన్స్ మొదలైన వాటి కోసం తమ దగ్గర వివిధ రకాల శాటిలైట్స్ ఉన్నాయని అన్నారు. వీటన్నింటికి భిన్నమైన సాఫ్ట్ వేర్లు రక్షణ కల్పిస్తున్నాయని తెలిపారు.