ఈ ఏడాది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)ఎన్నో చారిత్రక మైలు రాళ్లను చేరుకుంది. 1969లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 125 అంతరిక్ష నౌకలు ( spacecraftS), 94 లాంఛ్ మిషన్స్, 15 స్టూడెంట్ శాటిలైట్స్, 431 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా ఈ ఏడాది భారత్ చరిత్ర సృష్టించింది.
ముఖ్యంగా బాలీవుడ్ సినిమా కన్నా తక్కువ బడ్జెట్‌తో చంద్రయాన్-3 మిషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంతో ఇస్రోపై ప్రపంచ దేశాలు ప్రంశసలు కురిపిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం ఎనిమిది మిషన్స్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. వాటిలో చంద్రయాన్-3, ఆదిత్య మిషన్ వంటి అద్బుతమైన మిషన్స్ భారత్ కు గొప్ప పేరును తీసుకు వస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఇస్రో తన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) నుంచి ఎస్ఎస్‌ఎల్వీ-డీ2ను విజయవంతంగా ప్రయోగించింది. అందులో ఏడు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, రెండు కో-ప్యాసింజర్ శాటిలైట్స్ జానస్ -1, ఆజాద్–2 ను పంపింది. ఈ ఎస్ఎస్ఎల్వీ చిన్న శాటిలెట్స్ ప్రయోగాలు ప్రపంచ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్ గా నిలబెట్టాయి.
వాణిజ్య ఉపగ్రహాల లాంఛింగ్ మార్కెట్‌లో ఇస్రో తన స్థానాన్ని సుస్థిర పరుచుకునేలా ఈ ఏడాది మార్చిలో లాంచ్ వెహికల్ మార్క్-3(LVM-3) ద్వారా 36 వన్ వెబ్ ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో విజయవంతంగా ప్రవేశ పెట్టింది. వన్ వెబ్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం ఇది రెండోసారి. ఇది ఎల్‌వీఎం-3లో వరుసగా ఆరవ విజయవంతమైన ప్రయోగం కావడం గమనార్హం.
ఇది ఇలా వుంటే స్వదేశీ పున: వినియోగ స్సేస్ వెహికల్ (reusable space vehicle)టెక్నాలజీ విషయంలో ఇస్రో మరో ముందడుగు వేసింది. ఈ ఏడాది ఏప్రిల్-2న ఆర్ఎల్‌వీ-ఎల్ఈఎక్స్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటకలోని చిత్ర దుర్గా నుంచి ఈ శాటిలైట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రోపై ప్రశంసల జల్లు కురిసింది.
ఏప్రిల్22న ఇస్రో మరో వాణిజ్య మిషన్ చేపట్టింది. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలు TeLEOS-2, Lumelite-4లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 741 కిలోలు, 16 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రాథమిక, కో ప్యాసింజర్ శాటిలైట్స్ తో పాటు పీఎస్ఎల్వీ-సీ55, టెఈఎల్ఈఓఎస్-2 మిషన్‌లో పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)ను కూడా ప్రయోగించింది.
మే 29న NVS-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి , ఇస్రో విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ఎన్వీఎస్-01 ఉపగ్రహం ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) సర్వీస్ కోసం రూపొందించిన రెండో తరం ఉపగ్రహాల శ్రేణిలో ఇది మొదటి సిరీస్ కావడం గమనార్హం. నావిక్ కు సహాయం చేయడం, నావిక్ సేవలను మెరుగు పరిచే లక్ష్యాలతో దీన్ని ఇస్రో ప్రయోగించింది.
ఈ ఏడాది ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్ చంద్రయాన్-3. అగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసింది. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన మొట్ట మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచం మొత్తం ఇస్రో ప్రయోగాల వైపు ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నాయి.
ఈ ఏడాది జూలైలో శ్రీహరికోట నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగాన్ని చేపట్టింది. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాన్ని మోసుకెళ్ళే పీఎస్ఎల్వీ-సీ56ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ముఖ్యంగా, కోర్-అలోన్ మోడల్ పీఎస్ఎల్వీ-సీ56 వెహికల్ డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ (NEO)లోకి ప్రవేశపెట్టింది.
చంద్రయాన్-3 తర్వాత ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక మిషన్ ఆదిత్య ఎల్-1 మిషన్. సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భారతదేశపు మొట్ట మొదటి సౌర మిషన్ ఆదిత్య-ఎల్1 ను ఇస్రో ప్రారంభించింది . ఇందులో మొత్తం ఏడు పేలోడ్‌లు ఉన్నాయి, ఇవి సూర్యునిపై విస్తృత పరిశోధనలను చేపట్టాయి. ఇందులో నాలుగు పేలోడ్స్ సౌర కాంతిని, మిగిలిన మూడు పేలోడ్స్ ప్లాస్మా, అయస్కాంత క్షేత్ర పారామితులను పరిశీలించనున్నాయి.