చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో పీఎస్ఎల్వీ సహాయంతో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు. ఈ మిషన్ వాస్తవానికి చంద్రుడి మీదికి వెళ్లదు. దీన్ని లాగ్రేంజ్ పాయింట్ 1 (ఎల్-1) వద్దకు పంపుతారు. ఇంతకీ ఎల్-1 అంటే ఏమిటీ?
సూర్యుడు మండే అగ్నిగోళం. అందులో హైడ్రోజన్, హీలియం అణువులు అగ్ని జ్వాలలను సృష్టిస్తాయి. గ్యాస్, ప్లాస్మా నిండిని ఒక బాల్‌గా దీన్ని వర్ణిస్తుంటారు. దీని వద్దకు వెళ్లినా మాడిపోవడం మినహా మరేమీ ఉండదు. దీనిపై ల్యాండ్ అయ్యే పరిస్థితులూ ఉండవు. అందుకే ఇస్రో సూర్యుడిపై చేయనున్న ప్రయోగాలకు పంపే ఆదిత్య ఎల్-1 మిషన్ గురించి కొంత గందరగోళం ఉన్నది. ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను సూర్యుడి మీదికి ప్రయోగిస్తుందా? లేక దానికి కొంత దూరంలో ఉంచి పరిశీలిస్తుందా? అనేదానిపై చర్చ ఉన్నది.
ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో సూర్యుడిపైకి పంపదు. కానీ, దీన్ని లాగ్రేంజ్ ఎల్-1 అనే పాయింట్ వద్దకు పంపిస్తారు. ఈ పాయింట్ ఎక్కడుందనేగా మీ డౌటు. ఇది భూమికి సూర్యుడి వైపున (భూ కక్ష్యలోపలి వైపు) 1.5 మిలియన్ (15 లక్షల) కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పాయింట్‌నే ఎందుకు ఎంచుకున్నారు? దీనికీ ఒక వ్యూహం ఉన్నది.
ఖగోళంలో పెద్ద వస్తువులకు దాని పరిమాణం(బరువు!) బట్టి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంటే.. భూమి కంటే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అయితే.. అది ఆ వస్తువు నుంచి దూరంగా జరుగుతున్నా కొద్దీ తగ్గుతుంది. సూర్యుడు, భూగ్రహానికి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 అనే పాయింట్ వద్ద దాదాపుగా సమానంగా ఉంటాయి. అంటే.. గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 పాయింట్ వద్ద ఈక్విలిబ్రియంలో ఉంటాయి. కాబట్టి, అక్కడ ఒక శాటిలైట్‌ను తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ కాలం ఆపరేట్ చేయవచ్చు. అంటే.. తక్కువ ఖర్చుతో మనం దాన్ని మూవ్ చేయవచ్చు.