సూర్యుడి(Sun)ని అధ్యయనం చేయడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఆదిత్య ఎల్-1 (Aditya L1)ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నిన్న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. మరోవైపు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఈరోజు ఇస్రో విజయవంతంగా చేపట్టింది.
దీంతో ఉపగ్రహం ఇప్పుడు 245 X 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 5న తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నట్టు ఇస్రో తెలిపింది. 16 రోజుల పాటు ఆదిత్య ఎల్-1 భూ కక్ష్యలోనే చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుని సూర్యుడిపై పరిశోధలను చేస్తుంది. ఆదిత్యలో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. వీటితో పాటు సౌర జ్వాలలు, సౌర రేణులువు, అక్కడి వాతావరణం గురించి శోధిస్తాయి.