భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రతిష్టాత్మక పరిశోధనకు రెడీ అయింది. తాజాగా శుక్రుని (Venus)పై పరిశోధనలకు గాను వీనస్ మిషన్‌కు ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపారు. వీనస్ మిషన్ కు సంబంధించి రెండు పేలోడ్స్ ను అభివృద్ధి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. అయితే శుక్రయాన్ ఎప్పుడు లాంఛింగ్ చేస్తారనే విషయాన్ని ఇస్రో వెల్లడించలేదు.
ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రస్తుతం తమ ముందు చాలా మిషన్లు వున్నాయని చెప్పారు. వీనస్ మిషన్ ను ఇప్పటికే కాన్ఫిగర్ చేసినట్టు వెల్లడించారు. వీనస్ మిషన్ కోసం తాజాగా రెండు పెలోడ్స్ ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు.
వచ్చే ఏడాది డిసెంబర్లో వీనస్ మిషన్ ను లాంఛ్ చేయనున్నట్టు చెప్పారు. కానీ స్పష్టమైన తేదీని మాత్రం ఆయన ప్రకటించలేదు. శుక్ర గ్రహం అనేది చాలా ఆసక్తికరమైన గ్రహమని తెలిపారు. దానిపై వాతావరణం కూడా ఉందన్నారు. భూమిపై ఉన్న వాతావరణం కంటే వంద రెట్లు పీడనం ఉంటుందన్నారు. అందులో పూర్తి ఆమ్లాలతో నిండి వుందన్నారు.
వీనస్ ఉపరితలంపైకి మనం ప్రవేశించలేమన్నారు. దాని ఉపరితలం గట్టిగా ఉందో లేదో మనకు తెలియదన్నారు. ఈ విషయాలన్నింటినీ తాము ఎందుకు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారో తెలిపారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక రోజు భూమి కూడా శుక్రగ్రహంలా మారి పోవచ్చన్నారు. ఒక పదివేల ఏండ్ల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చన్నారు.
ఇక చంద్రయాన్-3లోని ల్యాండర్, రోవర్లు యాక్టివ్ మోడ్ లోకి వస్తాయన్న ఆశలు పూర్తిగా సన్నగిల్లు తున్నాయి. లూనార్ డే నేపథ్యంలో రోవర్, ల్యాండర్లు ఇటీవల స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. తర్వాత ఈ నెల 22న చంద్రుని దక్షిణ భూభాగంపై సూర్యోదయం అయింది. దీంతో ల్యాండర్, రోవర్ లతో మరోసారి అనుసంధానం అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.