ఆటలు అనేవి మనుషులకు మానసిక ఉత్సాన్ని (Excitement), కాస్త వినోదాన్ని (Entertainment) పంచాలి కానీ, జీవితాలను నాశనం (Destroy) చేయకూడదు. అయితే నేడు కొందరు అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో క్రీడలను వ్యసనాలుగా మారుస్తున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ (World Cup) క్రికెట్ ( Cricket) ఫీవర్ ఉన్న వారిని టార్గెట్ చేసి బెట్టింగ్ లకు పాల్పడుతోన్నారు. కొందరు అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకొంటున్నారు.
ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు (Nellore) జిల్లా మత్స్యకార గ్రామాల్లో క్రికెట్ బెట్టింగ్ మాఫియా యదేచ్చగా రెచ్చిపోతుంది. విడవలూరు మండలం రామతీర్థం గ్రామ కేంద్రంగా పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రశాంతంగా ఉండే మత్స్యకార గ్రామాల్లో క్రికెట్ భూతం ఇనప గజ్జలతో కరతాళ నృత్యం చేస్తుంది. గతంలో నెల్లూరు కావలి పట్టణాల్లో ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్ పేరు ఘనంగా వినిపించేది.
ఒకప్పుడు పట్టణాల్లో గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ వ్యాపారం ఇప్పుడు గ్రామాల్లో స్వైర విహారం చేస్తుంది. కేటుగాళ్లు అత్యాధునిక టెక్నాలజీ వాడి క్రికెట్ బెట్టింగ్ యదేచ్చగా నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం లేదా.. లేక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలఒగ్గుతున్నారా? అనే అనుమానాలు పలువురిలో కలుగుతోన్నాయి.
అయితే గతంలో ఎస్పీగా పని చేసిన PHD రామకృష్ణ, క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కు పాదం మోపారు. తరువాత వచ్చిన ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా మాయగాళ్ళ పై కన్ను వేయలేదు. ఫలితంగా క్రికెట్ బెట్టింగ్ ఊబిలో కూరుకొన్న వారు సర్వస్వం కోల్పోయి బలవన్మరణం చెందిన సందర్భాలు రాష్ట్రంలో ఏదో ఒక మూల వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి మత్స్యకార గ్రామాల్లో క్రికెట్ బెట్టింగ్ మాఫియాను దూరం చేసి పల్లెల ప్రశాంతతను కాపాడాలని ఆశిద్దాం..