ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కర్నూలు (Kurnool) జిల్లా ఆదోని (Adoni) ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి(23) అమెరికా (America)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదానికి కారణం అయిన పోలీసు కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం బుధవారం ప్రకటించింది.
సీనియర్ అటార్నీలతో సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఈ ప్రకటన చేసినట్లు తెలిపింది. మరోవైపు జాహ్నవి మరణంపై చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ లీసా మానియన్ తెలిపారు. అయితే అడెరెర్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలిపారు. ఆ వ్యాఖ్యలు ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉన్నాయని అన్నారు.
ఈ విషయంలో ఇప్పటికే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిపై చర్యల తుది విచారణాంశం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అడెరెర్.. పోలీసు చీఫ్ అడ్రియన్ డియాజ్ను కలిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఉన్నత చదువుల కోసం జాహ్నవి 2021లో అమెరికా వెళ్లింది. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. అయితే జనవరి 23న రాత్రి యూనివర్సిటీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది.
వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం రోడ్డు క్రాస్ చేస్తున్న జాహ్నవిని ఢీకొంది. ప్రమాద సమయంలో పోలీసు అధికారి కెవిన్ డేవ్ గంటకు 119 కి.మీ.ల వేగంతో వాహనం నడిపినట్లు.. ఈ వేగానికి ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడి తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచిందని సియాటిల్ పోలీసు విభాగం తెలిపింది. కాగా ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువలేదనడం తీవ్ర దుమారం రేపింది.