అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారైన ఘటనలు ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా(Jagtial) కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో డ్యూటీ నర్సు నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన ఇద్దరు చిన్నారులు(Childrens) తారుమారు అయ్యారు.
ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు కుటుంబాలకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాలకు చెందిన సల్మాన్ దంపతులకు, కోరుట్లకు చెందిన అన్వర్ దంపతులకు శనివారం (డిసెంబర్ 9న) తెల్లవారుజామున ఇద్దరికీ ఒకే సమయంలో మగ పిల్లలు జన్మించారు.
పుట్టిన వెంటనే సంబంధిత డ్యూటీ డాక్టర్స్, సిబ్బంది పసిపిల్లల చేతులకు ట్యాగ్స్ వేశారు. ఆ తర్వాత నాలుగు గంటల పాటు ఇద్దరు పసి పిల్లలను ఇంక్యుబేటర్‌లో పెట్టారు. నాలుగు గంటల తర్వాత శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఉదయ అనే డ్యూటీ నర్సు పిసి పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించింది. అయితే నర్సు ఉదయ పొరపాటుపడి ఒకరి బాబును మరొకరికి ఇచ్చింది.
గంట తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకున్న డ్యూటీ నర్సు.. కోరుట్లకు చెందిన అన్వర్ దగ్గరకు వచ్చి ఈ బాబు మీ బాబు కాదని చెప్పింది. వారి బాబును పొరపాటున జగిత్యాలకు చెందిన సల్మాన్ దంపతులకు అప్పగించానని చెప్పింది. దీంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డ్యూటీ నర్సుతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అన్వర్ మహమ్మద్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.