184
మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) విషయంలో మోడీ ( Modi) సర్కార్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ (Jai ram ramesh) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లోపించిందన్నారు. ఆ బిల్లును 2010లో కాంగ్రెస్ తీసుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పోల్చుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
2010లో ఆ బిల్లును తక్షణం అమలు చేసే ఉద్దేశంతో తమ పార్టీ చేసిందన్నారు. కానీ బీజేపీ తీసుకు వస్తున్న 2023 మహిళా బిల్లు మాత్రం జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం అమలులోకి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. దీన్ని జుమ్లా మెకానిజంగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు రోజు రోజుకూ మసకబారుతున్నాయన్నారు.
ఈ క్రమంలోనే మోడీ సర్కార్ “నారీ శక్తి” గురించి ఆలోచించిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేసేలా బిల్లును తీసుకు వచ్చామన్నారు. కానీ ఇప్పటి బిల్లును మాత్రం జనగణన, డీలిమిటేషన్ అంశాలతో లింక్ చేస్తూ బిల్లు అమలును మరింత జాప్యం చేస్తున్నారని అన్నారు. నియోజక వర్గాల పునర్విభజనతో ముడి పెట్టడంతో మహిళా రిజర్వేషన్ మరింత క్లిష్టంగా మారిందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ రోజు కేంద్రం లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలుపుతున్నట్టు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. ఈ బిల్లును తీసుకు రావడంతో రాజీవ్ గాంధీ స్వప్నం నెరవేరిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్ కల్పించారని వెల్లడించారు. ఈ బిల్లును తక్షణమే అమలులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.