రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై వైసీపీ (YCP) సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నించారు. ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ఆయన నిలదీశారు. ఏపీలో ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే పాలక పక్షం, మహిళా కమిషన్ హాహాకారాలు చేసిందన్నారు.
చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యార్థిని కిరాతకంగా హత్యకు గురైతే ముఖ్యమంత్రిగానీ, హోం మంత్రి గానీ, మహిళా కమిషన్ బాధ్యురాలు గానీ ఎందుకు స్పందించటం లేదని ఫైర్ అయ్యారు. అనుమానాస్పద మృతి అని చెప్పి దురాగత తీవ్రతను తగ్గించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
ఆ బాలిక తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయనగరం జిల్లా లోతుగడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తనను కలిచి వేసిందన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ, శాంతి భద్రతలు ఎలా వున్నాయో అర్థమవుతోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరవైందన్న మాట వాస్తవమన్నారు. మహిళలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులను పాలక పక్షం కట్టేస్తోందన్నారు. దిశ చట్టాలు చేశాం, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామనే పాలకుల ప్రకటనలు ఏ మాత్రం రక్షణ ఇవ్వడం లేదన్నారు. మహిళల రక్షణపై వైసీపీ సర్కార్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.