పాదయాత్ర సమయంలో జగన్ అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని.. నోటికి ఏదొస్తే అది వాగ్ధానం చేశారని.. ఇప్పుడు అమలు చేయకుండా అందరినీ మోసం చేశారని విమర్శించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పేదలకు అండగా ఉండకుండా మాటలతో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు భారం తప్ప, ప్రయోజనం లేదన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే బాధ్యతను జనసేన (Janasena) తీసుకుంటుందని తెలిపారు పవన్. క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ (Jagan) అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. నిజంగా క్లాస్ వార్ చేస్తుంది ఆయనేనని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన జనవాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎదుట తమ బాధలు చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. చేనేత కార్మికులు పవన్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ జీవనం చాలా కష్టంగా మారిందన్నారు. అప్పులు పెరిగిపోయాయని వాపోయారు. చేనేత కార్మికులు ఉపాధి కోసం దినసరి కూలీలుగా మారుతున్నారని చెప్పారు.
పవన్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. మగ్గం నేసినా కూడా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడిందని.. మహిళలకు అయితే చెప్పుకోలేని సమస్యలను వస్తాయన్నారు. చేనేతను బతికించుకోవాలనే తపన దేశంలో అందరికీ ఉండాలని తెలిపారు. తాను కూడా చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ప్రకటించానని.. కళానైపుణ్యం, కష్టంతో వారు కళాఖంఢాలు సృష్టిస్తారని.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జనవాణి కార్యక్రమంలో భాగంగా పలు వర్గాలవారు జనసేనానిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. తమ బాధలు తీరడం లేదని దివ్యాంగులు అన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు బధిరులు ఉంటే.. ఒకరికే పెన్షన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వం అనేక మందికి పెన్షన్ కూడా తొలగించిందని తెలిపారు. దీనిపై పవన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి మానసిక ధృక్పధం లేదన్నారు. మీకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సైన్ లాంగ్వేజ్ విధానాన్ని ప్రతి కార్యాలయంలో ఉండేలా చూస్తామన్నారు. బడ్జెట్ లో కూడా ఎక్కువ నిధులు కేటాయించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.