షహీద్ జతింద్ర నాథ్ దాస్ (Shaheed Jtindra Naht Das)….అనుశీలన్ (AAnushilan Samiti)సమితిలో కీలక సభ్యుడిగా పని చేశారు. సచింద్ర సన్యాల్ (Sachindra Nath Sanyal)తో కలిసి బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్‌తో పాటు అరెస్టయ్యారు. లాహోర్ జైళ్లో ఖైదీల పట్ల బ్రిటీష్ వారి అమానుష ప్రవర్తనను నిరసిస్తూ 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. జతింద్ర దాస్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘భారతదేశపు యువ దధీచి’అనే బిరుదు ఇచ్చారంటేనే ఆయన పోరాట పటిమ ఎలాంటిదో మనకు అర్థం అవుతుంది.
27 అక్టోబర్ 1904న కోల్‌కతాలో జతీంద్రనాథ్ దాస్ జన్మించారు. చిన్న వయసులోనే విప్లవ పోరాటల వైపు ఆకర్షితుడయ్యారు. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే బెంగాల్‌లోని అనుశీలన్ సమితి అనే విప్లవ సంస్థలో చేరాడు. 1925లో బీఏ చదివే రోజుల్లోనే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం జతిన్ దాస్ ను అరెస్టు చేసింది. ఆయన్ని మైమన్ సింగ్ జైలుకు తరలించారు.
జైలులో ఖైదీల పట్ల అధికారుల తీరు అమానుషంగా ఉండేది. దీనిపై జతిన్ దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే జైళ్లో అమరణ నిరాహార దీక్షకు దిగారు. సుమారు 20 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగించారు. జైలు అధికారులపై ఒత్తిడి పెరిగింది. వెంటనే జైలు సూపరింటెండెంట్ వచ్చి జతిన్ కు క్షమాపణ చెప్పారు. దీంతో జతిన్ నిరాహార దీక్ష విరమించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సచింద్ర సన్యాల్ వద్ద బాంబుల తయారీ నేర్చుకున్నారు. ఆ తర్వాత విప్లవ కారులకు స్వయంగా బాంబులు తయారు చేసి ఇచ్చారు. 1928లో కేంద్ర శాసన సభపై భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లు (లాహోర్ కుట్ర) బాంబు దాడి చేశారు. ఈ లాహోర్ కుట్ర కేసులో జతిన్ దాసును కూడా పోలీసులు అరెస్టు చేసి లాహోర్ జైలుకు తరలించారు.
లాహోర్ జైళ్లో సరైన సౌకర్యాలు లేవంటూ జతిన్ దాస్ నిరాహార దీక్షకు దిగారు. సుమారు 64 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో 13 సెప్టెంబర్ 1929న జతిన్ దాస్ మరణించారు. ఆయన అస్థికలను లాహోర్ నుంచి కోల్ కతాకు దుర్గా దేవీ ఊరేగింపుగా తీసుకు వచ్చారు. హౌరా రైల్వే స్టేషన్లో ఆ ఆస్తికలను నేతాజీ తీసుకుని అనంతరం వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జతిన్ దాస్ కు నేతాజీ ‘భారత యువ దధీచి’అనే బిరుదు ఇచ్చారు.