ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ (Political Party) ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ( Lakshminarayana) కొత్త పార్టీని స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నూతన పార్టీని ప్రకటించారు.
సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీని ప్రజల ముందుకు తీసుకు వస్తున్నామని చెప్పారు. రాజకీయాలు అంటే సుపరిపాలన అని తాము నిరూపిస్తామని వెల్లడించారు. వీళ్లు తిన్నారని వాళ్లు చెబుతున్నారని, వాళ్లేమి తక్కువ తినలేదని వీళ్లు చెబుతున్నారని మండిపడ్డారు. అవినీతిని అంతమొందించేందుకే జై భారత్ నేషనల్ పార్టీ వస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగం అనేది ప్రధాన సమస్యగా ఉందన్నారు. బానిసత్వం నుంచి ప్రజలకు తమ పార్టీ విముక్తి కలిగిస్తుందన్నారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలనే విషయాన్ని తమ పార్టీ నేర్పిస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకు వచ్చేందుకే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందన్నారు. కుంటుంబపాలన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తాము తప్పు చేయం.. అప్పు చేయబోమన్నారు. చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపేందుకే జైభారత్ నేషనల్ పార్టీ పుట్టుకు వచ్చిందని జేడీ వివరించారు.