చైనా (China) అధ్యక్షుడు జీ జిన్ పింగ్ (Xi Jinping) అమెరికా పర్యటనకు వెళ్లారు. విమానాశ్రయంలో జిన్ పింగ్ కు అమెరికా అధికారులు ఘన స్వాగతం పలికారు. సుమారు ఆరేండ్ల తర్వాత అగ్రరాజ్యంలో జిన్ పింగ్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2017లో చివరగా ఆయన అమెరికాలో ఆయన పర్యటించారు.
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ మధ్య ఇటీవల సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జిన్ పింగ్ అమెరికాలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-ఫసిపిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు జిన్ పింగ్ అమెరికా వెళ్లారు.
ఈ సమావేశం అనంతరం ఫిలోలీ ప్రాంతంలో బైడెన్ తో జిన్ పింగ్ భేటీ కానున్నట్టు అధికారులు వెల్లడించారు. మొదట వారిద్దరు ఏ ప్రాంతంలో సమావేశం అవుతారన్న విషయంపై అధికారులు గోప్యత పాటించారు. భద్రతా పరమైన ఇబ్బందుల నేపథ్యంలో వారి సమావేశం గురించి అధికారులు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వాతావరణ మార్పులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేయడం, దక్షిణ చైనా సముద్రంలో అలజడులు వంటి అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.