దేశాభివృద్ధికి హిందూ, ముస్లింల ఐక్యత ఎంతో అవసరమని జస్టిస్ చంద్ర కుమార్ (Justice Chandra Kumar) అన్నారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం మూడు ఒక్కటేనని తెలిపారు. దేశంలోని నేరస్తులను బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద జైలు నుంచి విడుదల చేస్తోందని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ అధికారులు ఎంఐఎం నేతలపై విచారణ జరపరన్నారు.
హైదరాబాద్ సోమాజిగూడలో ‘తెలంగాణలో అవినీతి ఆర్థిక, దోపిడీ రాజకీయాలను ఓడిద్దాం’,‘మత విద్వేష, విభజన నియంతృత్వ పాలనతో ఆదానీ, అంబానీలకు సేవ చేస్తున్న వారిని ఓడిద్దాం’ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ… జాగో తెలంగాణ బస్సుయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. దేశ సమగ్రతకు మత కల్లోలాలు మంచివి కావన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లను ఓడించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలని కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వివేక్ వెంటకస్వామి బీజేపీలో ఉన్నంత కాలం మంచోడని, పార్టీ మారాక ఐటీ దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ.. జాగో తెలంగాణ బస్సుయాత్ర విజయవంతంగా పూర్తైందన్నారు.
బీఆర్ఎస్ నాయకుల భూ దందాలు, ఇసుక మాఫియా, ప్రాజెక్టుల కమీషన్లను తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకున్నారన్నారు. కేటీఆర్ మాటలు విని నిరుద్యోగ యువత నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 35 లక్షల మంది నిరుద్యోగులు కారు గుర్తుకు ఓట్లు వేయరన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వాళ్లు కేసీఆర్ కు ఓట్లు వేయరని చెప్పారు.