భారత్ పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. కెనడా దౌత్యవేత్తలపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఇరు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితం కష్టతరంగా మారిందని అన్నారు. దౌత్యానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలకు (Basic Rules) విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఆ నిర్ణయం భారత ఉపఖండంలోని లక్షలాది మంది కెనడియన్ల శ్రేయస్సు, సంతోషం విషయంలో తనకు చాలా ఆందోళన కలిగించిందన్నారు. దౌత్యవేత్తల తరలింపు వల్ల ఇండియాలో కెనడా వీసా, కాన్సులార్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. దీని వల్ల పర్యాటక, వాణిజ్య రంగాల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
ఇది వియత్నాం కన్వెన్షన్ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని అన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమన్నారు. ఇది కేవలం కెనడాకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆందోళన కలిగించే విషయమన్నారు. మరోవైపు కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సమానత్వాన్ని అమలు చేసే విషయాన్ని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా చూపించే ప్రయత్నం చేయవద్దని కెనడాకు సూచించింది.
సమానత్వాన్ని అమలు చేసే విషయంలో తాము దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ లోని ఆర్టికల్ 11.1కి అనుగుణంగానే చర్యలు తీసుకున్నామని చెప్పింది.
ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితులు, భారత్‌లో కెనడా దౌత్య వేత్తలు అధిక సంఖ్యలో వుండటం, భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు నిరంతరం జోక్యం చేసుకుంటుడం వల్ల తాము పరస్పరం దౌత్యపరమైన సమానత్వాన్ని కోరుకుంటున్నామన్నారు.