కాకినాడ (Kakinada) జిల్లా ప్రత్తిపాడు (Prathipadu) 16వ నెంబర్ జాతీయ రహదారిపై, ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాద ఘటన వివరాలు తెలుసుకొంటే..
అన్నవరం (Annavaram) నుంచి రాజమహేద్రవరం (Rajamahedravaram) వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి టైర్ మార్చుతున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి లారీ మరమ్మతులు చేస్తున్న వారితో పాటు అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకొన్న ప్రత్తిపాడు సీఐ శేఖర్‌బాబు, ఎస్సై పవన్‌కుమార్ వివరాలు తెలుసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ప్రమాదానికి కారణమైన బస్సును గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో లారీ డ్రైవర్లు దాసరి ప్రసాద్, దాసరి కిశోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు ఉన్నారు. వీరంతా బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా ప్రయాణీకుల భద్రత మాకు ముఖ్యం అని చెప్పుకొనే ఆర్టీసీ బస్సుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి