కాకినాడ జిల్లా ఎస్పీ (Kakinada SP) ఎస్. సతీశ్ కుమార్ (Sathish Kumar) పై కేంద్ర హోం శాఖకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు చేసింది. భారతీయ వీసా నిబంధనలను ఉల్లంఘించి కొంత మంది విదేశీ పౌరులు ఇటీవల మతపరమైన, రాజకీయ ప్రసంగాలు చేశారని ఆరోపించింది. ఈ సమావేశానికి అనుమతినిచ్చిన ఎస్పీపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖను ఫోరమ్ కోరింది.
హోం సెక్రటరీ, ఐపీఎస్ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ, సిబ్బంది శిక్షణ శాఖకు పంపిన ఫిర్యాదు కాపీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జితేంద్ర సింగ్‌లకు కూడా పంపించినట్టు ఫోరమ్ వెల్లడించింది. ఫిర్యాదులో వెల్లడించిన వివరాల ప్రకారం….. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు కాకినాడలోని మెక్ లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో ‘గ్లోబల్ క్రుసేడ్ విత్ కుముయు’పేరిట సభలను నిర్వహించారు.
నైజీరియాకు చెందిన అంతర్జాతీయ పాస్టర్ విలియం కుముయు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఏపీ రాజకీయ భవిష్యత్ గురించి అంచనా వేస్తూ రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గత నెల 16న కాకినాడ హిందు ధర్మ రక్ష సమితి తరఫున చదలూరి గౌరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కానీ ఆ ఫిర్యాదును ఎస్పీ సతీశ్ కుమార్ పట్టించుకోలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఏపీలోని ప్రజానీకాన్ని రాజకీయంగా ప్రభావితం చేసేలా కుమయు వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో సంస్థ వెల్లడించింది. వీసా రకంతో సంబంధం లేకుండా విదేశీయులు భారత్‌లో మతపరమైన, రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన కూడదని తెలిపింది.
ఫారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 14(బి) వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా అవకాశం ఉందని పేర్కొంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అలాంటి ఈవెంట్‌ను అనుమతించినందుకు నిర్వాహకులతో పాటు దానికి అనుమతి ఇచ్చిన ఎస్పీపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.