మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ (Kamal Nath) తన పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఫలితాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ (Congress) ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేస్తున్నట్టు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆయన మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి కొత్త పీసీపీ చీఫ్ ను నియమించాలని ఆదేశించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు ఇటీవల ఎన్నికల సమయంలో సమాజ్ వాది పార్టీ ఇతర మిత్ర పక్షాలపై కమల్ నాథ్ వ్యాఖ్యలను హై కమాండ్ తప్పుపట్టినట్టు పేర్కొన్నాయి.
రాష్ట్రంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేక ఉందని, అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించకపోవడంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కలత చెంద వద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు కమల్ నాథ్ సూచించారు. సార్వత్రిక లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ లాంటి మహామహులే ఓడిపోయారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ తర్వాత 1980 ఎన్నికల్లో పార్టీ అద్బుతమైన ఫలితాలను సాధించిందన్నారు. దేశంలో 300లకు పైగా స్థానాలను గెలుచుకుని తన సత్తాను చాటిందన్నారు ఇప్పుడు కూడా అంతేనన్నారు.