కాంగ్రెస్ నేత కమల్ నాథ్ (Kamalnath) పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chouhan) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కమల్ నాథ్ మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాదని, ఆయన్ని నమ్మలేమని విమర్శించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని, తప్పుడు వాగ్దానాలు చేస్తుందని మండిపడ్డారు.
భోపాల్ జిల్లాలోని బెరాసియా అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ర్యాలీలో చౌహాన్ ప్రసంగించారు. కాంగ్రెస్ తన వాగ్దానాలు నెరవేర్చలేదని వెల్లడించారు. కమల్ నాథ్ మధ్యప్రదేశ్ కు చెందిన వారు కాదన్నారు. తాము ఇక్కడే పుట్టామని చెప్పారు. ఆయన ఎక్కడ జన్మించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
హిందీ సినిమాలోని పాటను ప్రస్తావిస్తూ… కమల్ నాథ్ మనకు అపరిచితుడని అన్నారు. ఆయన మనతో ఉండడని చెప్పారు. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పనులకు డబ్బుల కొరత ఏర్పడిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.
అభివృద్ధి పనులకు తమ దగ్గర డబ్బుల కొరత లేదని చౌహాన్ తెలిపారు. రాష్ట్రలో అన్ని రకాల అభివృద్ది పనులను చేపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతకు ముందు సాగర్ జిల్లాలోని కురై నియోజక వర్గం, రాజ్ ఘర్ జిల్లాలోని సారంగ్ పూర్ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు.