మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ (PCC Chief) పదవి నుంచి కమల్ నాథ్ (Kamal Nath)ను కాంగ్రెస్ తప్పించింది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో ఆయన్ని పదవి నుంచి పార్టీ తప్పించినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన జీతు పట్వారిని నూతన పీసీసీ చీఫ్గా నియమించింది.
ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని పార్టీ వెల్లడించింది. పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ అందించిన సేవలు మరువలేనివని పార్టీ ప్రకటలో పేర్కొంది. జీతూ పట్వారీ గతంలో కమల్ నాథ్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2018లో రౌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇటీవల సౌ అసెంబ్లీ స్థానం నుంచి జీతు పట్వారీ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి చేతిలో 35,000 ఓట్ల తేడాతో జీతూ పట్వారీ పరాజయం పాలయ్యారు. మరోవైపు కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా ఉమాంగ్ సింగార్ ను నియమిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. శాసన సభలో ప్రతిపక్ష నేతగా ఉమాంగ్ వ్యవహరిస్తారు.
శాసన సభ పక్ష ఉప నేతగా హేమంత్ కటారేను నియమిస్తున్నట్టు పార్టీ వెల్లడించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకు గాను బీజేపీ 163 స్థానాల్లో, కాంగ్రెస్ 66 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు ఛత్తీస్ గఢ్లో పార్టీ ఓటమి పాలైనప్పటికీ పీసీసీ చీఫ్ ను కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత పీసీసీ చీఫ్ దీపాక్ బాయిజ్ను కొనసాగిస్తున్నట్టు తెలిపింది.