నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని బ్రహ్మాం గారు చెప్పినట్లు కావేరీ జలాల (kaveri water) విషయంలో కర్ణాటక (karnataka), తమిళనాడు (tamilanadu) మధ్య వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం వల్ల నీటి ప్రవాహం తగు మాత్రంగా ఉంది. దీంతో సాగునీరు కోసం కర్ణాటక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమిళనాడుకు తాగునీటికి కావేరీ జలాలే పెద్ద దిక్కు. దీంతో తమకు రోజూ 24వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు అభ్యర్థనపై కావేరీ జలాల నియంత్రణ కమిటీ సానుకూలంగా స్పందించింది. 15 రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల విడుదల చేయాలని నిర్ణయించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పొరుగు రాష్ట్రానికి నీటిని విడుదల చేయలేకపోవడంపై కర్ణాటక తొలుత అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇరు రాష్ట్రాల అభ్యర్థన మేరకు సీడబ్ల్యూఆర్సీ(cwrc) మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకుంది.
వర్షాభావ పరిస్థితులు, తమిళనాడుకు నీటి విడుదల కారణంగా కావేరీ బేసిన్లో నీటి నిల్వ తగ్గుతోందని.. నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం నిరసనకు దిగారు. శ్రీరంగపట్న సమీపంలోని మాండ్యలో బుధవారం ఉదయం ప్రారంభించిన ఆందోళనలు.. రాత్రి కూడా కొనసాగించారు. వీరికి స్థానిక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దర్షన్ పుట్టనయ్య కూడా మద్దతుగా నిరసనల్లో పాల్గొన్నారు.
కావేరి జలాల అంశంపై చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం (deputy cm) డీకే శివకుమార్ (dk sivakumar) ఢిల్లీ (delhi)కి వెళ్లనుండగా.. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయితేనే కావేరీ జలాలు విడుదల చేస్తామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కర్ణాటక అఫిడవిట్ దాఖలు చేసింది.
రిజర్వాయర్లను ఖాళీ చేయడంతో తాగునీటికి ఎద్దడి ఏర్పడుతుందని, తమిళనాడుకు నీటి విడుదల చేయలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ‘గురువారం ఢిల్లీకి వెళ్లి మా న్యాయ బృందాన్ని కలుస్తాను.. రోజుకు 25 టీఎంసీలు నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు డిమాండ్‌పై మన నీటిపారుదల విభాగం అధికారులు వాదనలు స్పష్టంగా వినిపించారు.. మేము 3 వేల క్యూసెక్కులు మాత్రమే ఇవ్వగలం’ అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
‘రాష్ట్ర పరిస్థితిని కోర్టుకు అర్థమయ్యేలా చేసి (తమిళనాడుకు విడుదల చేసిన నీటిని) ఎంతమేర తగ్గించవచ్చో చర్చిస్తాం.. ఇతరులకు ఈ బాధ్యతను అప్పగించడం మాకు ఇష్టం లేదు. ప్రస్తుతం కీలక పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి.. మన రైతులను మనం కాపాడుకోవాలి’ అని ఆయన చెప్పారు. ఇక, దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జల జగడం కొనసాగుతోంది. ఈ వివాదం పరిష్కారానికి 1990లో కేంద్ర ప్రభుత్వం కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.